ANDRAPRADESH: గతంలో ఎన్నడూ లేనట్లు కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్న హైకమాండ్, టెక్నాలజీని వాడుకుని కార్యకర్తలు సూచించిన వారికే పదవులు కట్టబెట్టేలా చర్యలు తీసుకుంటోంది. టీడీపీలో గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎంపికలో అధిష్టానం కొత్త పంథా అనుసరిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లు కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్న హైకమాండ్, టెక్నాలజీని వాడుకుని కార్యకర్తలు సూచించిన వారికే పదవులు కట్టబెట్టేలా చర్యలు తీసుకుంటోంది.
గతంలో గ్రామ కమిటీలు ఎంపిక నామ్ కే వాస్తేగా ఉండేది. ఎమ్మెల్యే లేదా ఆ స్థాయి నేత చెప్పిన వారే గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఉండేవారు. ఇక మిగిలిన పదవులకు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. మండల కమిటీలకు ఇదే పద్ధతి అనుసరించేవారు. జిల్లా కమిటీలను మాత్రం అధిష్టానం ప్రకటించేది. వాస్తవానికి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహించాల్సివుంటుంది. కానీ, ఏ పార్టీ కూడా ఎన్నికల నిర్వహణ అనేది కేవలం కాగితాలకే పరిమితం చేస్తుంది. కానీ, టీడీపీ ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి కార్యకర్తలను కూడా భాగస్వామ్యం చేయడం చర్చనీయాంశమవుతోంది.
సహజంగా తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ఎన్నుకుంటారు. ఆ తర్వాత జిల్లా స్థాయి ఇంకా దిగువ స్థాయి పదవులకు నియామకాలు జరుగుతాయి. ఇదంతా పార్టీ అధిష్టానమే చూసుకునేది. కానీ, ఇప్పుడు పార్టీలో యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శకం నడుస్తోంది. పార్టీని కొత్త పుంతలు తొక్కించాలని భావిస్తున్న లోకేశ్.. కార్యకర్తల ఆమోదం ఉన్న వారే పదవుల్లో ఉండాలని నిబంధన విధించారు. అదే సమయంలో ఒక సమావేశం నిర్వహించి అక్కడ కమిటీలను ఎంపిక చేయడమంటే గొడవలకు అవకాశం ఇచ్చినట్లేనని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఎన్నడూ లేనట్లు జిల్లా, నగర కమిటీలకు ఈ సారి పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో మంత్రి నారా లోకేశ్ ప్రత్యామ్నాయం ఆలోచించారని అంటున్నారు.
ఎన్ని అడ్డంకులు ఉన్నా, కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే కమిటీల ఎంపిక జరగాలని భావిస్తున్న మంత్రి నారా లోకేశ్.. ఐవీఆర్ఎస్, వెబ్ లింకు ద్వారా కార్యకర్తలను సంప్రదించి గ్రామ కమిటీలు, ఆ తర్వాత మండల, పట్టణ, నగర, జిల్లా కమిటీలను ఎంపిక చేయాలని పార్టీ వర్గాలను ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో మంత్రి లోకేశ్ సూచనల మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రామ కమిటీలకు ఎంపిక చేసిన వారి పేర్లతో ఓ జాబితా తయారు చేసి కార్యకర్తల ఫోన్లకు పంపిస్తున్నారు. ముందుగా ఫోన్ చేసి పార్టీ కార్యాలయం నుంచి సమాచారమిస్తున్నారు.
ఆ తర్వాత వెబ్ లింక్ ఓపెన్ చేసి చూస్తే గ్రామ కమిటీ సభ్యుల పేర్లు కనిపిస్తున్నాయి. వారి ఎంపిక ఇష్టమైతే ఎప్రూవ్ చేయమని లేదంటే రిజక్ట్ చేయమని ఆ కిందనే ఉంటుంది. దీని ప్రకారం కార్యకర్తలు తమ అభిప్రాయాలతో కమిటీలను ఎన్నుకోవడం కొత్తగా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీలో మంత్రి లోకేశ్ క్రియాశీలం అయ్యాక ఎన్నో మార్పులు తీసుకువచ్చారని కార్యకర్తలు చెబుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత పార్టీ సభ్యత్వం ఉన్న వారికి గ్రూపు ఇన్సూరెన్స్ చేయించిన లోకేశ్ కార్యకర్తలకు ఆర్థికంగా అండగా నిలిచారని గుర్తు చేస్తున్నారు.
అప్పటి నుంచి ఏటా ఏదో విధంగా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న లోకేశ్ తాజాగా వారి అభిప్రాయాలకు విలువనివ్వాలని భావించడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. దీనివల్ల పార్టీలో కష్టపడి పనిచేసే వారికి కొత్త అవకాశాలు దక్కుతున్నాయని చెబుతున్నారు. గతంలో కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే సమయంలోనూ ఇదే పంథాను అనుసరించారని, దాని వల్ల గరిష్టంగా అసమ్మతి లేకుండా చూసుకున్నారని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో మంత్రి లోకేశ్ మార్కు మార్పులు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.